
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని పిలుపునివ్వడంతో మార్కుక్ మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో ఎర్రవల్లి ప్రాంతం పోలీసు కోటను తలపిస్తోంది. ఫామ్ హౌస్ చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వెయ్యి మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, ఫామ్ హౌస్ పరిసరాల్లో కంచె ఏర్పాటు చేశారు.
డీఐజీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. ఫామహౌస్కు సమీపంలోని ప్రాంతాల్లో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
మరోవైపు బీఆర్ఎస్కు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు సుమారు 150 మంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టనున్న ముట్టడి ప్రయత్నాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు పలువురు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఎర్రవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు