హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మాదిగలంటే అంతా చులకన భావం ఉండటం ఎంతవరకు కరెక్టో పొన్నం ప్రభాకరే ఆలోచించుకోవాల్సిన అసరం ఉందన్నారు. లక్ష్మణ్ను దున్నపోతు అనాల్సినంత అవసరం ఏముంది? అసలు ఎందుకు అనాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో తాను ఇవాళ ఉదయం నుంచి పొన్నంకు రెండు సార్లు ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆదివారం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి వివేక్ వెంకట స్వామి చెవిలో 'మనకు టైం అంటే ఏమిటో తెలుసు. జీవితం అంటే ఏమిటో తెలుసు. వాడు ఓ దున్నపోతు వాడికేం తెలుసు' అంటూ గుసగుసలాడాడు. ఈ మాటలు మైక్లో రికార్డు అయ్యాయి. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించే పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి.. ఈ వ్యవహారంపై స్పందిస్తూ పొన్నం తీరుపపై మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు