హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
ఫేక్ డాక్టరేట్లను ప్రధానం చేస్తున్న పెద్దిటి యోహాన్ అనే వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. పెద్దిటి యోహాన్ ఒక్కొక్కరి వద్ద నుండి రూ.15 వేల నుంచి రూ.20వేలు డబ్బులు తీసుకుని డాక్టరేట్లను ప్రధానం చేస్తున్నట్లు సమాచారం
అందడంతో ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో ఫేక్ డాక్టరేట్లు ప్రదానం చేసిన అనంతరం పెద్దిటి యోహాన్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరుతో పెద్దిటి యోహాన్ గత కొంతకాలంగా డాక్టరేట్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నాడు. ఆంద్రప్రదేశ్కి చెందిన కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి డాక్టరేట్లు ఇస్తామని నమ్మపాలికాడని సైఫాబాద్ పోలీసులు తెలిపారు. డాక్టరేట్ తీసుకున్న ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి వలపన్ని పట్టుకున్నారు. పెద్దిటి యోహాన్ నుండి ఫేక్ డాక్టరేట్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని, యోహాన్ పై బీఎన్స్ యాక్ట్ 318 క్లాస్ 4 చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు. యోహాన్ గుంటూరు జిల్లా, గురుజాలకి చెందిన వ్యక్తి అని సైఫాబాద్ పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..