అమరావతి, 7 అక్టోబర్ (హి.స.)
రాయలసీమ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా, రానున్న 24 గంటల్లో సీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. సోమవారం కూడా రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
ఇది ప్రస్తుత పరిస్థితి కాగా, రానున్న మూడు నెలల కాలానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లో దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఏకంగా 112 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అంచనా వేసింది. ముఖ్యంగా అక్టోబరు నెలలో వర్షపాతం 115 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది.
సాధారణంగా ఈ రుతుపవనాల ప్రభావం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళతో పాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. వివిధ వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం, అక్టోబరు 17 నుంచి 21వ తేదీ మధ్య ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన వెంటనే ఈశాన్యం కూడా కరుణించనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV