హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.) కొందరు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తుంటారు. మరికొందరు ఇయర్ఫోన్స్ పెట్టుకుని అదేపనిగా మాట్లాడుతూ ఇతర వాహనాలను పట్టించుకోరు. ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వీడియోలు చూడటం, ఇయర్ఫోన్స్ వినియోగించడం వంటి చర్యలు ప్రమాదకరమైనవే కాకుండా శిక్షార్హమైనవని, ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీలను నడుపుతున్న డ్రైవర్లు ఇలా చేస్తూ తరచుగా కనిపిస్తున్నారని చెప్పారు. వాహనాన్ని నడుపుతున్న సమయంలో ఫోన్ వాడటం వల్ల వారి దృష్టి రోడ్డుపై ఉండదని, ఇది ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్య చర్యలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డ్రైవర్, ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు