మహబూబ్నగర్, 7 అక్టోబర్ (హి.స.)
జాతీయ రహదారి నెంబర్ 167
విస్తరణతో పాటు.. జడ్చర్ల బైపాస్ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించాలని కన్సల్టెన్సీకి ఆదేశించినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశాడని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జడ్చర్ల బైపాస్ కి ఈ ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మే నెలలో రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో పాటు షాద్ నగర్ ప్రాంతంలో ఆయనను కలిసి జడ్చర్ల బైపాస్ రోడ్డు ఆవశ్యత గురించి తెలియజేసినట్టు తెలిపారు.
జడ్చర్ల పట్టణం మీదుగానే హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి నెం. 44, రాయచూరు- కోదాడ జాతీయ రహదారి నెం.167 పట్టణం మధ్యలో నుంచి వెళుతుండటంతో రోజూ వేల సంఖ్యలో వాహనాలు జడ్చర్ల గుండా రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుందని, దీనివల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని గడ్కరీకి అనిరుధ్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ తనకు అధికారికంగా లేఖ రాసారని, అందులో 167 వ నెంబర్ జాతీర రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి, అలాగే జడ్చర్ల బైపాస్ రోడ్డు కు సంబంధించిన పనులపై అధ్యయనం చేసి డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను రూపొందించడానికి కన్సల్టెంట్ ను నియమించడం జరిగింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు