అమరావతి, 7 అక్టోబర్ (హి.స.):మద్యం కుంభకోణంలో విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో ఉన్న ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు ఈనెల 13 వరకు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్ నాయుడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్యతో పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, నవీన్‌కృష్ణలను పోలీసులు ఏసీబీ కోర్టులో సోమవారం హాజరు పరిచారు. వారికి రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో బెయిల్ పొందిన ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప కోర్టు వాయిదాకు హాజరయ్యారు.
బెయిల్ పొందిన నిందితులకు వాయిదాల నుంచి మినహాయింపు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ షరతులను సడలించాలని న్యాయవాదులు కోరగా.. పిటిషన్ దాఖలు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. కోర్టు హాలులో చెవిరెడ్డి ఫొటోలు, వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన సిట్ ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ ఓ యువకుడి వద్ద సెల్‌ఫోన్ లాక్కుని వీడియోలు, ఫొటోలు తొలగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ