అమరావతి, 7 అక్టోబర్ (హి.స.)
ఏపీ రైతులకు కొత్త కష్టాలు వచ్చాయి. పలు జిల్లాల్లో ఆఫ్రికా నత్తలు పంటలను నాశనం చేస్తూ.. రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఆఫ్రికా నత్తలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? వీటికి పరిష్కారం ఉందా? వంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతులను ఆఫ్రికా నత్తలు కష్టాల్లోకి నెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాల్లోని పంటలను పీల్చి పిప్పి చేస్తుండటంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు, ప్రకాశరావుపాలెం, ముసళ్ళగుంట, సింగరాజుపాలెం ప్రాంతాల్లోని రైతాంగం.. అధికంగా పామాయిల్, బొప్పాయి, కోకో వంటి పంటల్ని సాగుచేస్తుంది. అయితే ఈ పంటలపై ఆఫ్రికా నత్తలు దండెత్తి.. తామరతంపరగా చేరి కాండం నుంచి రసం పీల్చి వేయడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. మూడు నెలల క్రితం అక్కడక్కడా కనిపించిన ఆఫ్రికా నత్తలను చూసి, చూడనట్లు వదిలేయడంతో సమస్య పెరిగి పెద్దదైంది. చెట్ల కాండాల్లోని రసంతో పాటు.. ఆకులు, చిగురులను కూడా తినేస్తున్నాయి. మొదట అక్కడక్కడా కనిపించిన ఈ ఆఫ్రికా నత్తల్ని ఏరి తగలబెట్టారు. కానీ.. వాటి నివారణ పూర్తి కాలేదు. పురుగుమందులు పిచికారి చేసినా ఫలితం లేకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV