అమరావతి, 7 అక్టోబర్ (హి.స.)వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhasker Reddy) కుమారుడు మోహిత్ రెడ్డి (Mohit Reddy)కి హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. జగన్ సర్కార్ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మద్యం సరఫరా, పాలసీ మార్పులు, కిక్ బ్యాకులు, ఎన్నికల ఖర్చులకు అక్రమ నగదు వాడకం వంటి ఆరోపణలపై నిందితులపై కేసు నమోదు కాగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపడుతోంది.
కేసులో A39గా ఉన్న మోహిత్ రెడ్డి మద్యం కంపెనీల నుంచి సేకరించిన సుమారు రూ.300 కోట్లను వైసీపీ ఎన్నికల ఖర్చులకు చేరవేయడంలో పాలుపంచుకున్నారు. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (TUDA) వాహనాలను ఉపయోగించి హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి వరకు రూ.8 కోట్ల నగదును రవాణా చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో చంద్రగిరి స్థానంలో తన తండ్రి పోటీ చేస్తుండగా అక్రమ నగదును ఓటర్లకు పంపిణీ చేశారని మద్యం సిండికేట్ నుంచి సిట్ వివరాలు రాబట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV