అమరావతి, 7 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ రాజకీయాలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో తెలంగాణపై దృష్టి సారించిన చంద్రబాబు ఆ తర్వాత ఫోకస్ అంతా ఏపీపైనే కేంద్రీకరించారు. జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన క్రమంలో తెలంగాణ నేతలో భేటీ కానుండటం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య ఇప్పటికే హైవోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్న క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు స్కెచ్ ఏంటీ అనేది ఉత్కంఠగా మారింది.
తెలంగాణలో టీడీపీకీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్నా ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీ చేయలేదు. ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో జూబ్లీహిల్స్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెలంగాణ గడ్డపై చంద్రబాబు చూపులు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనే చర్చ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయబోతోందా? లేక ఏపీలో బీజేపీ, జనసేనతో కూటమిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి మద్దతు ఇస్తుందా? అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నిర్ణయం తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో పెను సంచలనానికి కారణం కావొచ్చనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అధినేత ముందు తెలంగాణ నేతలు ఎలాంటి ప్రతిపాదనలు ఉంచబోతున్నారు? వాటిపై చంద్రబాబు ఏ రకమైన డిసిషన్ తీసుకోనున్నారు అనేది తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV