అమరావతి, 8 అక్టోబర్ (హి.స.), :సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడి యత్నాన్ని నిరసిస్తూ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. ఏపీ హైకోర్టు ఆవరణలోని జాతీయ జెండా వద్ద హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ హైకోర్టు అంబేడ్కరైట్స్ అడ్వొకేట్ అసోసియేషన్ మంగళవారం చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు. సీజేఐపై దాడి యత్నాన్ని ముక్తకంఠంతో ఖండించారు.
భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కె.చిదంబరం తదితరులు మాట్లాడుతూ... సీజేఐపైనే దాడికి యత్నించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడికి ప్రయత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని కోరారు. సనాతన ధర్మం పేరుతో చేసే దాడులను క్షమించడానికి వీల్లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ