
అనంతపురం, 15 నవంబర్ (హి.స.) రైల్వే ఆర్మ్డ్ సీఐ సతీశ్ కుమార్ కేసును తాడిపత్రికి బదిలీ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపం కోమలి రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహం లభ్యంకావడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. సతీశ్ కుమార్‌కు పోస్టుమార్టం పూర్తి కావడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇక కేసును సీఐడీ డీజీ పర్యవేక్షిస్తున్నారు. సతీశ్‌ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తును ముమ్మరంగా చేశారు. సతీశ్ కుమార్ తల వెనుక ఆయుధంతో కొట్టినట్లు బలమైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. ఈ మేరకు సతీశ్ కుమార్ హత్యకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి.
ప్రస్తుతం కేసు దర్యాప్తు మరింత ఊపందుకుంది. రాయలసీమ ఎక్స్ ప్రెస్‌లో సతీశ్ కుమార్ ప్రయాణం చేసినట్లు గుర్తించారు. అంతకుముందు గుంతకల్లు రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో తన బైకును పార్క్ చేశారు. ఆ తర్వాత భార్యకు సతీశ్ ఫోన్ చేశారు. 4సార్లు ఫోన్ చేసినా భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరోవైపు సతీశ్ కుమార్ జర్నీ చేసే సమయంలో రైలు బోగీలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సతీశ్ కుమార్ ఎక్కిన బోగి ప్రయాణిలను గుర్తించారు. వారితో మాట్లాడుతున్నారు. త్వరలోనే కేసు ఛేదిస్తామని తెలిపారు.
ఇక సతీశ్ కుమార్ పరకామణిలో జరిగిన చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను పోలీసులు విచారించారు. మరోసారి విచారణకు రావాలని కూడా సూచించారు. ఇందులో భాగంగా సతీశ్ కుమార్ గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లేందుకు రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. అయితే అదే రోజు కోమలి రైల్వే ట్రాక్ పక్కన సతీశ్ కుమార్ మృతదేహం కనిపించడంతో తీవ్ర అనుమానాలు తలెత్తాయి. ఇప్పటి వరకూ చేపట్టిన దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించారు. సతీశ్ కుమార్ హత్య, ఆత్మహత్యా కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసును తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV