
అమరావతి, 20 నవంబర్ (హి.స.)ఈ మధ్య కాలంలో ఓటీటీ సెంటర్లలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలకు కూడా థ్రిల్లర్ టచ్ ఇస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ టచ్ తో కూడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ 128 ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సిరీస్ పేరే 'ఉప్పు పులి కారం'. సౌత్ కొరియన్ సిరీస్ 'మై ఫాదర్ ఈజ్ స్ట్రేంజ్' ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది. 2024 మే 30 నుంచి 2025 జనవరి 2వ తేదీ వరకూ తమిళంలో సందడి చేసిన ఈ సిరీస్, ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
కథ: సుబ్రమణ్యం( పొన్ వణ్ణన్) సుబ్బలక్ష్మి (వనిత కృష్ణచంద్రన్) దంపతులు చెన్నై లో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని హోటల్ నడుపుతుంటారు. వారి కొడుకే ఉదయ్ (నవీన్ మురళీధర్). అతను ఐఏఎస్ చేయాలనేది ఆ దంపతుల కోరిక. అందువలన కష్టపడి అతనిని చదివిస్తూ ఉంటారు. వారి పెద్దమ్మాయి చిన్మయి (ఆయేషా జీనత్) లాయర్ గా పనిచేస్తూ ఉంటుంది. రెండో అమ్మాయి కీర్తి (అశ్విని) జిమ్ ట్రైనర్ గా వర్క్ చేస్తుంటుంది. ఇక మూడో అమ్మాయి యాషిక (దీపిక) ఒక టీవీ ఛానల్ లో పని చేస్తూ ఉంటుంది.
'చిన్మయి'కి కోపం ఎక్కువ .. ధైర్యం కూడా ఎక్కువే. శివ (కృష్ణ రఘునందన్)తో ఆమెకి బ్రేకప్ అవుతుంది. అందుకు కారణం తెలుసుకోవడం కోసం అతను ఆమె వెంటపడుతూనే ఉంటాడు. అతను శ్రీమంతుల కుటుంబానికి చెందిన షర్మిళ (సోనియా) ఒక్కగానొక్క కొడుకు. ఇక టీవీ సీరియల్స్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న 'టిప్పూ', నటనలో భాగంగా ఎమోషన్స్ ను పలికించలేక పోతుంటాడు.
అప్పుడప్పుడు పోలీసులను చూడగానే సుబ్రమణ్యం భయపడిపోతూ ఉంటాడు. భార్య అతనికి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఏడాదికి ఒకసారి వాళ్లు రహస్యంగా ఒక ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. సుబ్రమణ్యం హోటల్ బిల్డింగ్ ను కొనేసిన శివ తల్లి షర్మిళ, ఖాళీ చేయమని వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక తాను నటుడిగా రాణించాలంటే, ముందుగా తన తండ్రి ఎవరనేది తెలుసుకోవాలనే పట్టుదలతో 'టిప్పూ' రంగంలోకి దిగుతాడు.
టిప్పూ తండ్రి ఎవరు? ఎలాంటి ఎమోషన్స్ లేకుండా అతను ఒంటరిగా ఎందుకు పెరగాల్సి వస్తుంది? పోలీసులను చూసి సుబ్రమణ్యం ఎందుకు భయపడుతున్నాడు? ఏడాదికి ఒకసారి ఆ దంపతులు ఎక్కడికి వెళ్లివస్తున్నారు? ఉదయ్ కలెక్టర్ అవుతాడా? చిన్మయి - శివ మధ్య అపార్థాలు తొలగిపోతాయా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. ఆ కష్టం పిల్లలకి తెలియకుండా చూసుకుంటారు. ఎలాంటి సమస్యలైనా వాళ్లవరకూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ గాయపడిన గతమేదైనా ఉంటే, అది కూడా పిల్లలకి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలన్నీ ఉన్న సుబ్రమణ్యం దంపతుల చుట్టూ అల్లుకున్న కథ ఇది.
పిల్లలంతా ఆనందంగా ఉంటే, తల్లిదండ్రులకు అంతకుమించిన సంతోషం ఇంకొకటి ఉండదు. అయితే ఎవరి పనిపై వాళ్లు బయటికి వెళ్లినప్పుడు, ఏ వైపు నుంచి ఎలాంటి సమస్య వచ్చిపడుతుందనేది ఎవరికీ తెలియదు. ఆ వైపు నుంచి దర్శకుడు వేసుకొస్తున్న ట్రాక్ ఆసక్తిని పెంచుతూ వెళుతుంది. రాబోయే కోడలు 'లా' చదివి ఉండకూడదని శివ తల్లి అనుకుంటూ ఉంటే, అతను లాయర్ చిన్మయి వెంటపడుతుండటం మరింత కుతూహలాన్ని పెంచుతుంది.
ఒక వైపు నుంచి సుబ్రమణ్యం ధోరణి .. మరో వైపు నుంచి 'టిప్పూ' వైఖరి కూడా ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఒకరి గతంతో ఒకరికి గల సంబంధం ఏమిటనే సందేహం ఈ కథను కదలకుండా ఫాలో అయ్యేలా చేస్తుంది. కొత్త పాత్రలు .. కొత్త మలుపులతో సాగిపోయే ఈ సిరీస్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పనితీరు: సహజత్వంతో కూడిన కథాకథనాలు .. ఆసక్తికరమైన మలుపులు ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు కథను విసరింపజేస్తూ వెళ్లడం, ఆయా పాత్రలు .. వాటిని నడిపించే విధానం కూడా మెప్పిస్తుంది. కుటుంబంలో ఎవరు ఏం చేసినా, అది ఆ కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఈ కథ వివరిస్తుంది.
నటీనటుల సంఖ్య ఎక్కువే. అయితే ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతుంది. అందరూ కూడా చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా ప్రధానమైన పాత్రలలో పొన్ వణ్ణన్ - వనిత నటన హైలైట్ గా నిలుస్తుంది. చిన్మయి పాత్రలో ఆయేషా జీనత్ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ మంచి మార్కులు కొట్టేస్తాయి.
ముగింపు: ఒకప్పటి మాదిరిగా ఇప్పుడు సన్నివేశాలను సాగదీస్తూ కూర్చుంటే ఆడియన్స్ ఓపికతో చూసే పరిస్థితి లేదు. జోనర్ ను .. దానిని ఇష్టపడే ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, చెప్పదల్చుకున్న విషయాన్ని వేగంగా .. బోర్ అనిపించకుండా చెప్పాలి. అలాంటి పద్ధతిని అనుసరించిన సిరీస్ గా ఇది కనిపిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV