
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.) పొరుగు దేశం బంగ్లాదేశ్ ను భారీ భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో 5.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి ఢాకాలో ఇప్పటి వరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గోడ కూలి ముగ్గురు, బిల్డింగ్ రూఫ్ కూలి ముగ్గురు మరణించినట్లు తెలిపింది.
ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరుస్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్డిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ భూకంపం బంగ్లాదేశ్-ఐర్లాండ్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటూ మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు.
మరోవైపు ఈ ప్రకంపనల ధాటికి భారత్లోనూ భూమి కంపించింది. కోల్కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్లోని కూచ్బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్పూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు