
లండన్, 4 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. లండన్‌లో అనేకమంది దిగ్గజాలతో భేటీ అవుతున్నారు. తాజాగా భారత హైకమిషనర్ శ్రీ విక్రమ్ దొరైస్వామితో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ - యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, విద్యా సహకారం, ఆవిష్కరణలు, ప్రవాస భారతీయులతో మమేకమై రాష్ట్రానికి మేలు జరిగేలా చూడ్డం తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం
ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, యుకెతో సహకారంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. ఈ చర్చలు ఏపీలో ఆర్థిక అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తగిన తోడ్పాటునిచ్చేలా సాగాయి. భేటీకి ముందు, హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV