
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)
మాజీ ప్రధాన మంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ లపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరు ప్రధానులు భారత్లోని ఒక పర్వతంపై నిఘా పరికరం అమర్చేందుకు అమెరికా కు అనుమతిచ్చారని X వేదికగా ఆరోపించారు.
చైనా కార్యకలాపాలపై నిఘా కోసం మన దేశంలో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నేతృత్వంలో కోవర్ట్ ఆపరేషన్ దశలవారీగా జరిగిందని, నెహ్రూ హయాంలో తొలిసారి అణు ఆధారిత నిఘా పరికరాన్ని నేటి ఉత్తరాఖండ్లోని నందాదేవీ పర్వత శిఖరాన అమర్చేందుకు అనుమతించారని దూబే తన పోస్టులో పేర్కొన్నారు. తర్వాత ఇందిరాగాంధీ హయాంలోనూ అందుకు అనుమతి లభించిందని ఆరోపించారు.
ఆ తర్వాత అగ్రరాజ్యం నందాదేవి నుంచి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుందని దూబే తెలిపారు. పర్యావరణపరంగా సున్నితమైన హిమాలయన్ ప్రాంతంలో ఆ ప్రమాదకర పరికరాన్ని వదిలేసి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తున్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇది కారణం కాదా..? అని ప్రశ్నించారు. హిమానీనదాలు కరగడానికి, క్లౌడ్బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు కూడా ఇదే కారణమా..? అని అనుమానం వ్యక్తంచేశారు.
కొన్ని నెలల క్రితం కూడా దూబే ఈ విషయంపై కాంగ్రెస్ను విమర్శించారు. నందాదేవీ పర్వతంపై కనిపించకుండా పోయిన అమెరికా అణు పరికరానికి, ఉత్తర భారతంలో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు ముడిపెడుతూ ఆయన విమర్శలు చేశారు. నెహ్రూ, ఇందిరతోపాటు రాహుల్ గాంధీ విదేశీ శక్తులకు లొంగిపోయి, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని మండిపడ్డారు. వారి చర్యలు భావితరాలకు ప్రమాదకరంగా మారాయని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..