
ఢిల్లీ, 15 డిసెంబర్ (హి.స.)
ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా
మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'ఓట్ చోరీ ర్యాలీ'లో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలలో బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు 'ప్రధాని మోడీకి సమాధి తవ్వాలంటూ' నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నినాదాలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ సభ్యులు, ప్రధానిని చంపాలని కాంగ్రెస్ పిలుపునిచ్చిందా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత ప్రధాని గౌరవాన్ని కించపరిచేలా, హింసను ప్రేరేపించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు, పార్లమెంట్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. 'ఓట్ చోరీ' పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, కానీ అంతకు మించి ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. గందరగోళం మధ్య సభా కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో, ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు