
ముంబై, 15డిసెంబర్ (హి.స.)
మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుని, కేంద్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఒక మరాఠీ వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. పింప్రి చించ్వాడ్‌లో సామాజిక కార్యకర్త మానవ్ కాంబ్లే రాసిన జనగణమన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఈ వాదనకు అమెరికాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదలతో సంబంధం ఉందన్నారు
. ఈ ఫైల్స్ విడుదల భారత్‌లో కూడా రాజకీయ గందరగోళానికి దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు భారత రాజకీయాలపై కూడా బలమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. ‘‘అమెరికన్ కాంగ్రెస్ నవంబరు 19న ఒక చట్టాన్ని ఆమోదించింది.
డిసెంబరు 19న స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడిన ప్రముఖుల పేర్లను ప్రకటించవచ్చు. అమెరికాలోని ఓ ఇంట్లో ఇజ్రాయెల్ గూఢచారి ఏజెంట్ రహస్య కెమెరాలను ఉపయోగించి సేకరించిన ఒక రహస్య వీడియో రికార్డింగ్‌లో చాలా మంది రాజకీయ నాయకుల ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ పేర్లలో కొన్ని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనే దాని గురించి నా వద్ద వివరణాత్మక సమాచారం లేదు. ఈ పరిణామాల పర్యవసానాలు అమెరికాకే పరిమితం కాకుండా, భారత్ సహా అనేక దేశాలలో కనిపించే అవకాశం ఉంది’’ అని పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ