
న్యూఢిల్లీ, 30 మే (హి.స.)
గడిచిన 11 ఏళ్ల నుంచి దేశంలో బ్యాంకు మోసాలు పెరిగిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఫ్రాడ్, ఫేక్లు ప్రభుత్వం రక్తంలో ఇమిడిపోయినట్లు ఆయన ఆరోపించారు. 11 ఏళ్ల మోదీ పాలనలో సుమారు 6 లక్షల 36 వేల 992 కోట్ల మేర బ్యాంకు ఫ్రాడ్ జరిగిందని, ఆ మోసాలు 416 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దు అయిన ఆరేళ్ల తర్వాత కూడా నకిలీ 500 నోట్లు చెలామణి అవుతున్నాయని, ఇది 291 శాతం పెరిగినట్లు కాంగ్రెస్ నేత ఆరోపించారు.
ఈ ఏడాది నకిలీ నోట్లు మార్కెట్లోకి అత్యధిక స్థాయిలో వచ్చినట్లు ఖర్గే తెలిపారు. రక్తనాళాల్లో సింధూరం ప్రవహిస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మీ రక్తనాళాల్లో ఏం ఉందో మాకు తెలియదని, కానీ మీ ప్రభుత్వ రక్తనాళాల్లో మాత్రం ఫ్రాడ్, ఫేక్ ఉన్నట్లు ఖర్గే ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..