
ముంబై, 12 డిసెంబర్ (హి.స.) భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి జారుకుంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఒక దశలో 54 పైసలు క్షీణించి రూ.90.48 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డు కనిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ కాస్త కోలుకున్నప్పటికీ, చివర్లో 38 పైసల నష్టంతో రూ.90.32 వద్ద స్థిరపడింది. ఇది సరికొత్త కనిష్ఠ ముగింపు కూడా.
కారణాలివీ..: అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంలో జాప్యం ఇందుకు ప్రధాన కారణం. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు వచ్చే మార్చి వరకు సమయం పట్టవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన వ్యాఖ్యలు మన కరెన్సీపై ఒత్తిడిని మరింత పెంచాయి. మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిరవధికంగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం, భారత్‌పై మెక్సికో సుంకాల విధింపు కూడా రూపాయిని కిందికి జార్చాయి. ఫెడ్ రేట్లు తగ్గిన నేపథ్యంలో డాలర్ కాస్త బలహీనపడటం, ముడి చమురు ధరల తగ్గుదలతోపాటు మన ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో పయనించడం కరెన్సీకి కొంత మద్దతుగా నిలిచాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ