న్యూఢిల్లీ, 24 జూన్ (హి.స.)
భారత క్రికెట్ రంగంలో విషాదం నెలకొంది. సీనియర్ క్రికెటర్, భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (77) లండన్‌లో సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దిలీప్ దోషి కొన్ని దశాబ్దాలుగా బ్రిటన్ రాజధాని లండన్‌లోనే నివసిస్తున్నారు. ఆయనకు భార్య కళిందీ, కుమారుడు నయన్ (మాజీ క్రికెటర్, సర్రే మరియు సౌరాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించారు), కుమార్తె విశాఖ ఉన్నారు.దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. “మాజీ భారత స్పిన్నర్ దిలీప్ దోషి లండన్‌లో మరణించడం చాలా విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని బీసీసీఐ పేర్కొంది.
1947 డిసెంబర్ 22న అప్పటి రాజ్‌కోట్ సంస్థానంలో జన్మించిన దిలీప్ దోషి, తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌కు పేరుపొందారు. 30 ఏళ్ల వయసులో 1979 సెప్టెంబర్ 11న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, తనదైన ముద్ర వేశారు. 1979 నుంచి 1983 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.33 టెస్టు మ్యాచ్‌లు, 15 వన్డేలు ఆడారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..