
త్రిసూర్ , 27 జూన్ (హి.స.)కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక రాబోయే ఐదు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఇదిలా ఉంటే భారీ వర్షాలు కారణంగా ఒక భవనం కుప్పకూలిపోయింది. త్రిసూర్ సమీపంలోని కొడకరలో భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. శిథిలాల కింద 27 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మరో 19 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. గాయపడ్డవారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వలస కార్మికులు నివాసం ఉంటున్న రెండంతస్తుల పాత భవనం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. రాత్రిపూట కురిసిన వర్షానికి నిర్మాణం దెబ్బతిని భవనం కూలిపోయినట్లు వెల్లడించారు. కార్మికులంతా పనుల కోసం బయల్దేరుతుండగా తెల్లవారుజామున 6 గంటల సమయంలో భవనం కూలిపోయిందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు