శిమ్లా , 30 జూన్ (హి.స.)ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కుదిపేస్తున్నాయి. హిమాచల్‌లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. శిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా అందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడినుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 129 రహదారులు మూతపడ్డాయి. మండీ, సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలన్‌లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో.. కాంగ్రా, మండీ, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 2023లో వర్షాకాలంలో 550 మంది ప్రాణాలు కోల్పోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు