కాండ్లా, 30 జూన్ (హి.స.)భారత్ నుంచి ఒమన్‌కు వెళ్తున్న ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈమేరకు సమాచారం అందుకున్న వెంటనే భారత నౌకాదళ (Indian Navy) సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ సాయంతో హుటాహుటిన నౌక వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన నౌకలో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నట్లు నేవీ అధికారులు తెలిపారు.
‘‘ఎం.టి యీ చెంగ్ 6 అనే నౌక గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఒమన్‌కు బయల్దేరింది. అందులో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నారు. మార్గమధ్యలో ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్ గదిలో మంటలు చెలరేగడంతో మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో సిబ్బంది అత్యవసర సాయం కోసం సందేశం పంపారు. సమీపంలో విధుల్లో ఉన్న ‘ఐఎన్‌ఎస్ తబర్ (INS Tabar)’.. వెంటనే అప్రమత్తమైంది. బోట్లు, హెలికాప్టర్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది, పరికరాలను తరలించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు చాలావరకు నియంత్రణలోకి వచ్చాయి’’ అని భారత నౌకాదళం ట్వీట్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు