న్యూఢిల్లీ: 17 జూలై (హి.స.)పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. వాస్తవంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ అందుకు అధికార పార్టీ నిరాకరిచింది. ఇక బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌పై కూడా సభలో కాంగ్రెస్ లేవనెత్తే అవకాశం ఉంది.
ఇక ఈ సమావేశాల్లో ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణ, క్రీడా పాలన, భూ వారసత్వ సంరక్షణతో సహా 8 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కోసం ప్రభుత్వం ఉభయ సభల ఆమోదాన్ని కోరనుంది. ఫిబ్రవరి 13, 2025న రాష్ట్రపతి జారీ చేసిన ప్రకటన ద్వారా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ