సింగపూర్, 28 జూలై (హి.స.)
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రుల బృందం సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, అభివృద్ధే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు సోమవారం సీఎం చంద్రబాబు బృందం పలువురు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో భేటీ కానుంది.
.
భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ట్రెజరీ బిల్డింగ్‌లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి టాన్‌సీలెంగ్‌తో చంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు. ఉదయం 8.30 గంటలకు ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వేంకట్ కట్కూరితో సమావేశమవుతారు. అలాగే ఉదయం 9 గంటలకు హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ‘నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మరలడం, కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చిస్తారు. ఇందులో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్శిటీ, సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ & డిజైన్ విద్యార్ధులు పాల్గొంటారు. 11 గంటలకు ఎవర్వోల్ట్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్‌తో సమావేశం అవుతారు.
11.30కు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై దృష్టి పెడతారు. మధ్యాహ్నం 1 గంటకు టుయాస్ పోర్ట్ సైట్‌లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి మౌలిక సదుపాయాలపై పీఎస్ఏ సీఈఓ విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొంటారు.
సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రప్రదేశ్-సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై చంద్రబాబు ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై ఇరువురు చర్చిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి