దిల్లీ,29 జూలై (హి.స.) మరికొన్ని నెలల్లో బిహార్ (Bihar)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం ప్రస్తుతం సీఎంగా ఉన్న నీతీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కేంద్రమంత్రి, ఎల్‌జేపీ(రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ (Chirag Paswan) పేర్కొన్నారు. నీతీశ్ సర్కారుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నా అని ఇటీవల విమర్శించిన ఆయన.. తాజాగా యూటర్న్ తీసుకోవడం గమనార్హం.
సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాసవాన్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీపై నా ప్రేమ, నిబద్ధత నిరంతరం ఉంటాయని ఉద్ఘాటిస్తున్నా. మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాల అనంతరం నీతీశ్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. కచ్చితంగా ఆయన సీఎం అవుతారు’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ గతంలో నాలుగుసార్లు జరిగిందన్నారు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానమవుతోంది తప్ప మరేం కాదన్నారు. దీనిపై ప్రతిపక్షం అంత గందరగోళం చేయాల్సిన అవసరం లేదన్నారు. జాబితా నుంచి అనర్హులను మాత్రమే తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రతిసారి ఎన్నికల తర్వాత ఏదోఒక ఫిర్యాదు లేవనెత్తడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందని విమర్శించారు.
2
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ