మంగళూరు ,29 జూలై (హి.స.) ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలకు సంబంధించిన కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టానని గతంలో ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసినట్లు చెప్పుకొన్న ఒక వ్యక్తి వెల్లడించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు సోమవారం అతడిని తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సిట్ అధికారి ఎంఎన్ అనుచేత్ వెల్లడించారు. మృతదేహాలను ఖననం చేసిన ప్రాంతాలను గుర్తిస్తానని.. అక్కడ పుర్రెలు, ఎముకలు, ఇతర అవశేషాలను చూపిస్తానని అతడు చెప్పడంతో సిట్ ప్రతినిధులు, ఫోరెన్సిక్ విభాగం, రెవెన్యూ, అటవీ శాఖల సిబ్బంది అటవీ ప్రాంతానికి చేరారు. నేత్రావతి నది స్నానఘట్టానికి ఆవలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభమైంది. దర్యాప్తు పూర్తయ్యాక అతడిని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని సిట్కు నేతృత్వం వహించిన డీఐజీ ప్రణబ్ మొహంతి తెలిపారు. 2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి చెప్పినట్లు సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ