న్యూఢిల్లీ: , 3 జూలై (హి.స.)చ్యవన్‌ప్రాష్‌ను తాము మాత్రమే ఆయుర్వేద గుణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామని, డాబర్(Dabur)లాంటి కంపెనీలు సాదాసీదాగా తయరు చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారని పతంజలి గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కంపెనీకి చెందిన పాపులర్ ప్రొడక్టుపై పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణమే ఆ ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశించాలని డాబర్ కంపెనీ పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాదు..
తమ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించినందుకుగానూ రూ.2 కోట్ల పరిహారం పతంజలి నుంచి ఇప్పించాలని డాబర్ కోరింది. మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఉత్పత్తులు తయారు చేస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుడు దారి పట్టించేలా ఉన్నాయంటూ పేర్కొంది. ‘‘మా(డాబర్) చ్యవన్‌ప్రాష్‌లో 40 మూలికలు ఉన్నాయని, కాబట్టి ఇది సర్వసాధారణమైందని పతంజలి ప్రచారం చేస్తోంది. అలాగే.. పతంజలి ప్రకటనల్లో తమ ఉత్పత్తిలో 51కు పైగా ఔషధ మూలికలు ఉన్నాయని చెప్పినా, వాస్తవానికి 47 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, పతంజలి ఉత్పత్తిలో మెర్క్యురీ వాడుతున్నారని, ఇది పిల్లలకు హానికరం’’ అని డాబర్ తన పిటిషన్లో ప్రస్తావించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు