తెలంగాణ, సంగారెడ్డి. 8 జూలై (హి.స.)
ఇటీవల భారీ ప్రమాదం జరిగిన పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీని మంగళవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NDMA) బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై నిశితంగా అధ్యయనం చేశారు. భారీ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి..? ఇలాంటి సంఘటనలు పరిశ్రమలలో పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పరిశ్రమల శాఖ, అగ్నిమాపక, కార్మిక, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు
ఇదిలా ఉండగా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అఖిలేష్ అనే కార్మికుడు మంగళవారం ఉదయం మరణించారు. దీంతో మృతుల సంఖ్య 44కు చేరింది. కాగా, వివిధ దవాఖానల్లో 16 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. మరో 8 మంది కార్మికుల జాడ ఇంకా తేలలేదు..
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు