విశాఖ, 9 జూలై (హి.స.)బడా ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా విశాఖ వస్తున్నాయి. ఇక్కడ పదేళ్లుగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం)లో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్ కంపెనీని ఫ్రాన్స్‌కు చెందిన పేరొందిన కంపెనీ ‘క్యాప్‌జెమిని’ కొనుగోలు చేసింది. డబ్ల్యూఎన్‌ఎ్‌సకు ఇండియాలో విశాఖతోపాటు పుణె, గుర్గావ్, ముంబైల్లో శాఖలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థలో 65 వేల మంది ఉద్యోగులు ఉండగా ఒక్క విశాఖలోనే ఐదు వేల మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా క్యాప్‌జెమినిలో డబ్ల్యూఎన్‌ఎస్ విలీనం పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ సంస్థ అద్దె భవనంలో నడుస్తుండగా.. క్యాప్‌జెమినికి కూడా భూమి ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖంగా ఉంది. సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఏఐ టెక్నాలజీ సేవలు కూడా అందించాలని క్యాప్‌జెమిని భావిస్తోంది. దీంతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే విశాఖలో టీసీఎస్, కాగ్నిజెంట్‌కు ప్రభుత్వం భూములు కేటాయించింది. గూగుల్ కూడా రాబోతోంది. అన్ని పెద్ద కంపెనీలూ విశాఖలో అడుగుపెడుతుండడంతో ఇతర సంస్థలు కూడా రావడానికి ఆసక్తి చూపుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ