భారత్‌తో సంబంధాలపై అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్ డి.సి , 12 సెప్టెంబర్ (హి.స.) భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త మలుపు తిరుగుతున్న వేళ అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య స్నేహపూర
వాషింగ్టన్ డి.సి


వాషింగ్టన్ డి.సి , 12 సెప్టెంబర్ (హి.స.)

భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త మలుపు తిరుగుతున్న వేళ అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య స్నేహపూర్వక ట్వీట్ల మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లూట్నిక్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

చమురు కొనుగోలు ఆపితేనే వాణిజ్య చర్చలకు ముందడుగు

తాజా ఇంటర్వ్యూలో లూట్నిక్ మాట్లాడుతూ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని పూర్తిగా ఆపిన తర్వాతే రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సమర్థవంతంగా ముందుకు సాగుతాయి అని స్పష్టం చేశారు.

అమెరికా ఇప్పటికే వాణిజ్య ఒప్పందాల విషయంలో గ్లోబల్ స్థాయిలో తమ ప్రయోజనాలను కాపాడుకునేలా సుంకాలు విధిస్తూ ఒత్తిడి తేవడం తెలిసిందే. ఇదే క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు లూట్నిక్ బదులిస్తూ భారత్ పేరును స్పష్టంగా ప్రస్తావించడం గమనార్హం.

గతంలో విమర్శలు - ఇప్పుడు మృదువైన స్వరంలో లూట్నిక్

గతంలో భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన లూట్నిక్ తాజాగా మాత్రం ఆచితూచి మాట్లాడారు. వాణిజ్య సమస్యలు పరిష్కారం దిశగా నడవాలంటే భారత్ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా సూచించారు.

భారత్ వైఖరి - చర్చలు సానుకూలంగా

ఇక భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఇరు పక్షాలు సంతృప్తిగా ఉన్నాయి. నవంబర్ నాటికి మొదటి విడత ఒప్పందం ఖరారయ్యే అవకాశముంది అని తెలిపారు.

అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్-మోదీ భేటీలో వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయాలని తమ అధికారులను ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande