ఢీల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.)దేశ రాజకీయాలలో ఆయనను కోట్లాదిమంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్నీ త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తుంటారని వారు భావిస్తుంటారు. అదే సమయంలో.. ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేశాన్ని వెనక్కి నడిపిస్తారని మరికొంత మంది తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఆయనెవరో కాదు.. పదమూడేళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించి, గత పదకొండు సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. దేశ రాజకీయాలపైనే కాదు.. ప్రజల మనోభావాలపై కూడా బలమైన ముద్ర వేసిన మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకుని బుధవారం 76వ పడిలో అడుగుపెట్టారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950లో పుట్టి.. బాల్యంలోనే తండ్రితో పాటు చాయ్ అమ్మిన మోదీ.. ఎనిమిదేళ్ల వయస్సులో ఆరెస్సె్‌సలో చేరారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంఘ్‌లో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకిఅడుగుపెట్టారు. గుజరాత్‌లో పార్టీని ఆయన సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్ల.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. ఆడ్వాణీ గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి చేపట్టిన రథయాత్రను సక్సెస్ చేయడంలో మోదీ పాత్ర కీలకం. అప్పుడే ఆయనపై జాతీయ నాయకుల దృష్టి పడింది. దీంతో 1990-91లో మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఏక్తా యాత్రను నిర్వహించే బాధ్యతను మోదీకి అప్పజెప్పారు. జోషీతో పాటు 15 వేల కిలోమీటర్లు దేశమంతటా తిరగడంతో గుజరాత్‌లో కూడా ఒక ప్రధాన నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారు.
1991 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎన్నికల వ్యూహన్ని రూపొందించే బాధ్యతలు చేపట్టిన మోదీ.. గాంధీనగర్ నుంచి ఆడ్వాణీ విజయానికి తీవ్రంగా తీవ్ర కృషి చేశారు. అంచలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. గుజరాత్ రాజకీయాలలో శంకర్‌సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో వాజ్‌పేయి స్వయంగా ఫోన్ చేసి మోదీకి గుజరాత్ సీఎంగా పట్టం కట్టారు. సీఎంగా మోదీ ఒక సమర్థుడైన పరిపాలకుడిగా వ్యవహరించి గుజరాత్ నమునాను ప్రపంచానికి పరిచయం చేశారు. గుజరాత్‌ను తాను పరిపాలించిన 13 ఏళ్లలో.. బలమైన పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థగా మార్చారు. బీజేపీలో వాజ్‌పేయి, ఆడ్వాణీ తర్వాత అతివేగంగా గుర్తింపు పొందిన నాయకుడైన మోదీ.. తాను సీఎంగా ఉండగానే పార్టీకి జాతీయస్థాయిలో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేశారు. వాజ్‌పేయి తర్వాత ఆడ్వాణీకి 10 సంవత్సరాలు పార్టీని నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ.. బీజేపీని అధికారంలోకి తీసుకురాలేకపోవడంతో 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. 2014లో దేశమంతటా మోదీ ప్రభంజనం వీయడంతో మొట్టమొదటిసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోదీ పార్టీకి విజయం సాధించి బీజేపీలో తనకు మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నారు. ఆయన హయాంలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు 18 రాష్ట్రాలలో అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం 21 రాష్ట్రాలలో ఎన్డీయే సారథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిన మోదీ.. పలు వైఫల్యాలను, విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే గుజరాత్ అల్లర్లు జరిగి వేలాది మంది ఊచకోత జరగడం ఆయన రాజకీయ జీవితంలో చెరిగిపోని మచ్చ. ప్రధానిగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. పెద్ద నోట్ల రద్దు, సాగుచట్టాలు, లాక్‌డౌన్ సమయంలో పేదల మరణాలు, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు, మణిపూర్‌లో రెండేళ్లపాటు జరిగిన హింసాకాండ, రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు, ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ఈడీ, సీబీఐ లాంటి వ్యవస్థలను దుర్వినియోగపరచడం, అనేక సందర్భాలలో అప్రజాస్వామిక వైఖరి ఆయన నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి. పుల్వామా, పహల్గాం ఉగ్రదాడులు.. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌తో ప్రారంభించిన యుద్ధాన్ని అంతర్జాతీయ ఒత్తిడితో 4రోజుల్లోనే ముగించాల్సి రావడం ఆయనకు అప్రతిష్ఠను తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు మోదీ అత్యంత స్నేహితుడిగా భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనకు వ్యతిరేకంగా మారి భారత్‌పై టారి్‌ఫల దాడి చేసినప్పటికీ చైనా, రష్యాలతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం మోదీ దౌత్యనీతికి నిదర్శనం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి