మోదీకి ట్రంప్ బ‌ర్త్‌డే విషెస్‌.. 'థ్యాంక్యూ మై ఫ్రెండ్' అంటూ ప్ర‌ధాని రిప్లై
ఢిల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.)భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య కీ
ుు


ఢిల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.)భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మిత్రుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ 'ఎక్స్‌' (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. “భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీలాగే నేను కూడా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుంది” అని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ ఫోన్ కాల్ జరిగిన సమయంలోనే, ఢిల్లీలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్, భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలు సానుకూలంగా, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జరిగాయని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి.

భారత్‌తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న ఆయన మాట్లాడుతూ “ఇరు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను” అని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ చర్చల ఫలితంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోవైపు, భారత్‌కు అమెరికా రాయబారిగా నామినేట్ అయిన సెర్గియో గోర్ కూడా గత వారం సెనేట్ హియరింగ్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. “భారత్ మా వ్యూహాత్మక భాగస్వామి. ప్రస్తుతం మేము వారితో చురుకుగా చర్చలు జరుపుతున్నాం. ఒప్పందానికి చాలా దూరంలో లేము” అని ఆయన వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న సంకేతాలను బలపరుస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande