కమ్చట్కా, 19 సెప్టెంబర్ (హి.స.)రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పాన్ని శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదవడంతో అధికారులు వెంటనే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ భూకంప కేంద్రం కమ్చట్కా రాజధాని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 128 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. భూకంప తీవ్రతకు ఇళ్లలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు తీవ్రంగా కంపించాయి. వీధుల్లో ఆపి ఉంచిన కార్లు సైతం అటూ ఇటూ ఊగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, రష్యాకు చెందిన భూభౌతిక సేవల విభాగం మాత్రం భూకంప తీవ్రత 7.4గా నమోదైందని, దీని తర్వాత ఐదుసార్లు భూమి స్వల్పంగా కంపించిందని పేర్కొంది. అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తీర ప్రాంతాలపై ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ ఘటనపై కమ్చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్ ద్వారా స్పందించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి. ద్వీపకల్పంలోని తూర్పు తీరానికి సునామీ హెచ్చరిక జారీ చేశాం. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం అని ఆయన తెలిపారు.
పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే రింగ్ ఆఫ్ ఫైర్ అనే అత్యంత క్రియాశీలక టెక్టోనిక్ బెల్ట్ పై ఈ ప్రాంతం ఉండటం వల్లే ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత జులైలో కూడా ఇక్కడ 8.8 తీవ్రతతో భూకంపం రాగా, దానివల్ల ఏర్పడిన సునామీ ఓ గ్రామాన్ని సముద్రంలోకి లాక్కెళ్లిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి