అమరావతి, , : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకూ జరిగే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావొచ్చని అధికారుల అంచనా. 11 రోజుల్లో.. 11 రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది వేడుకల నిర్వహణలో సాంకేతికతను పెద్దఎత్తున వినియోగిస్తున్నట్లు ఆలయ ఈవో వి.కె.శీనానాయక్ తెలిపారు. ‘దసరా-2025’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, భక్తులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా సెప్టెంబరు 29న సోమవారం సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చే దుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల మధ్యలో దర్శించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ