విజయవాడ, 22 సెప్టెంబర్ (హి.స.)తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా... మైసూరు దసరా ఉత్సవాలను తలపించేలా నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్’కు సర్వం సిద్ధమైంది.
దసరా సందర్భంగా విజయవాడలో సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యే ఈ ఉత్సవ్‌లో భాగంగా నగరవ్యాప్తంగా 11 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
50 లక్షల మందికిపైగా భక్తులు, పర్యాటకులు ఈ ఉత్సవ్‌కు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో 200కు పైగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ప్రతి కార్యక్రమంలోనూ తెలుగుదనం ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు. కూచిపూడి, భరతనాట్యం, భక్తి సంగీతం, సాంఘిక నాటకాలు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట, పద్య, పౌరాణిక నాటకాల ప్రదర్శనతో పాటు పున్నమి ఘాట్‌లో దాండియా, దేవీ దర్శనం, లైవ్ బ్యాండ్స్, వాటర్ స్పోర్ట్స్, డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ నిర్వహిస్తారు. గొల్లపూడిలో విజయవాడ ఎక్స్‌పో నిర్వహిస్తారు. దీనిలో ఎమ్యూజ్‌మెంట్ పార్క్, గ్లోబల్ విలేజ్, ఫుడ్ కోర్టులు, మార్కెట్లు, ఓపెన్ థియేటర్లు ఉంటాయి. సినీ సంగీత దర్శకులైన మణిశర్మ, ఆర్పీ పట్నాయక్, కార్తీక్‌ల మ్యూజిక్ లైవ్, తో పాటు గాయకులు సునీత, రామ్ మిరియాల, గీతామాధురితో లైవ్‌షోలు నిర్వహిస్తారు. ఎంజీ రోడ్డులో లక్షలమందితో మెగా కార్నివాల్ నిర్వహిస్తారు. విజయవాడ ఉత్సవ్‌ను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా హెలికాప్టర్ రైడ్‌లు సిద్ధం చేశారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి రైడ్ ప్రారంభమవుతుంది.
మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 6 గంటలకు పున్నమి ఘాట్ వద్ద ‘విజయవాడ ఉత్సవ్’ను ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. కాగా, విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన 15ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి