అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.)గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది (Krishna river)కి భారీగా వరద కొనసాగుతుంది. ఈ ఏడాది జులై నెల నుంచి వరద ప్రారంభం కావడంతో అన్ని జలాశయాల గేట్లను ఎత్తిన అధికారులు వేల వందల టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు తెలంగాణ ఏపీలో కృష్ణ నది పరివాహ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది.
వారం కిందట ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదికి భారీగా వరద పెరగడంతో ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, టైల్ పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల నుంచి భారీగా వరద వస్తుండటంతో.. శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) 10 గేట్లు 10 అడుగుల ఎత్తి 3,39,496 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలాశయానికి (Nagarjuna Sagar Reservoir) వరద పెరగడంతో అప్రమత్తం అయిన అధికారులు 29 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి.. వేగంగా సముద్రంలోకి పరుగులు తీస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి