న్యూయార్క్/దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.)
: ఉగ్రవాదంపై ప్రపంచం ఏ మాత్రం సహనం చూపకూడదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన బీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రసంగించారు. ఉగ్రవాదుల మధ్య విస్తృత నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకునేవారే అంతర్జాతీయ సమాజానికి పెద్ద సేవ చేస్తారని జైశంకర్ వివరించారు. ఆర్థిక అస్థిరత్వం, ఘర్షణలు, ఉగ్రవాదం వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని, ఐక్య రాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థలు సంక్షోభాలను పరిష్కరించడంలో విఫలం అవుతున్నాయని విమర్శించారు. ఐరాసలో సంస్కరణల అవసరం ఎప్పుడూ లేనంతగా ఉందని, ప్రపంచ పాలనను మరింత నిర్మాణాత్మకంగా, జవాబుదారీగా మార్చాలని పిలుపునిచ్చారు. బి20 సభ్య దేశాలకు ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ఉందని, చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి, ప్రపంచ అభివృద్ధి మధ్య సంబంధం ఉందని, అయితే ఇటీవలి కాలంలో రెండూ ఏకకాలంలో క్షీణించాయని, ఫలితంగా ముఖ్యంగా దక్షిణార్థగోళ దేశాలకు నష్టం జరిగిందని ఆయన తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ