దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.)
అంతర్జాతీయ వేదికగా భారత్‌ను నిందించాలని చూసిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సింధూజలాల ఒప్పందం నిలిపివేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌ను తప్పుబట్టాలని ప్రయత్నించారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif). ఆయన ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్. అసంబద్ధ నాటకాలతో వాస్తవాలను ఏమార్చలేరంటూ ఆమె కడిగిపారేశారు. ఇంతకీ ఎవరీ పేటల్ గహ్లోత్ (Petal Gahlot)..?
పేటల్ గహ్లోత్ (Indian diplomat Petal Gahlot) మహారాష్ట్రకు చెందిన రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టారు. ముంబయిలోని సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత దిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ విమెన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2015లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS)లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు.
గత పదేళ్లలో ఆమె వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కేంద్ర విదేశాంగ శాఖకు చెందిన యూరోపియన్ వెస్ట్ డివిజన్‌లో అండర్ సెక్రటరీగా సేవలందించారు. పారిస్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్యసమితిలోని భారత మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ