ఆగ్రా, 28 సెప్టెంబర్ (హి.స.)
ఆశ్రమం లైంగిక కేసులో ఒక ప్రధాన నిందితుడు స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథిని ఈ రోజు ఉదయం ఆగ్రాలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఆగ్రాలోని ఒక హోటల్ నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానందను విచారించిన తర్వాత, అన్ని రహస్యాలు బయటపడతాయని భావిస్తున్నారు.
నైరుతి ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళా విద్యార్థులనున వెకిలిచేష్టలకు పాల్పడ్డట్లు.. స్వయం ప్రకటిత మత గురువు స్వామి చైతన్యానంద సరస్వతిపై ఆరోపణలు ఉన్నాయి. మార్చి 2025లో ఒక విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దీంతో నిందితులు పారిపోయారు. 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చైతన్యానందపై ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆగ్రాలోని ఒక హోటల్‌లో బస చేసిన చైతన్యానందను ఢిల్లీ పోలీసులు ఆదివారం (సెప్టెంబర్ 28) తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
ముందస్తు బెయిల్ తిరస్కరణ
అరెస్టు నుంచి తప్పించుకోవడానికి, చైతన్యానంద కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు స్వామి చైతన్యానంద సరస్వతి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. విచారణ సందర్భంగా, చైతన్యానంద సరస్వతి ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అని చెప్పుకున్నారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీని ఫలితంగా స్వామి చైతన్యానందపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. అంతేకాదు 18 ఖాతాలలో జమ అయిన సుమారు రూ. 8 కోట్లు, 28 ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్తంభింపజేశారు. ఈ డబ్బు నిందితుడు పార్థసారథి సృష్టించిన ట్రస్ట్‌తో ముడిపడి ఉంది.
అసలు విషయం ఏమిటి?
కొన్ని రోజుల క్రితం, శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన 17 మంది విద్యార్థినులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, చైతన్యానంద రాత్రిపూట తమను బలవంతంగా తన బెడ్ రూమ్ కు పిలిపించి శారీరక సంబంధంలోకి తీసుకునేవాడని ఆరోపించారు. అంతేకాకుండా, బాలికల హాస్టల్ గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారనే విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక మంది విద్యార్థినులను రాత్రిపూట అతని ప్రైవేట్ గదికి పిలిపించి విదేశీ పర్యటనలకు బలవంతం చేశారని ఫిర్యాదు చేశారు. తనను బలవంతంగా మధురకు తీసుకెళ్లారని ఓ విద్యార్థిని ఆరోపించింది. లైంగిక వేధింపులతో పాటు, నకిలీ లైసెన్స్ ప్లేట్ వాడటం, మతాన్ని ఉపయోగించి మోసం చేసినందుకు స్వామి చైతన్యానందపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు వచ్చినప్పటి నుండి ఢిల్లీ పోలీసులు చైతన్యానంద కోసం వెతుకుతున్నారు. ఆదివారం, పోలీసులు ఆగ్రా నుండి నిందితుడు చైతన్యానందను అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి