న్యూఢిల్లీ, దిల్లీ: 28 సెప్టెంబర్ (హి.స.)
: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ గత మూడు నెలల్లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ వినియోగం పెరగడం, కార్పొరేట్ సంస్థల నుంచి సేవల డిమాండ్ తగ్గడం వల్ల మానవ వనరులను తగ్గించుకుంటున్నామని శనివారం యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలిపారు. తొలగించే ఉద్యోగుల పరిహారం కోసం 865 మిలియన్ డాలర్ల మొత్తాన్ని కేటాయించామని వెల్లడించారు. తమకు అవసరమైన నైపుణ్యాలను వారికి నేర్పించడం గిట్టుబాటు కాని వ్యవహారం అని నిర్ధారణ అయిన చోటే తొలగింపులు చేపడుతున్నామని తెలిపారు. తమ క్లయింట్లకు అవసరమైన ఏఐ ఆధార సేవలు సత్వరమే అందించే విధంగా తమ మానవ వనరులను వేగంగా తీర్చిదిద్దుకుంటున్నట్లు చెప్పారు. మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీకి బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. ఉద్యోగులను తొలగించినప్పటికీ యాక్సెంచర్ లాభాలు గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పెరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ