కరూరు, 28 సెప్టెంబర్ (హి.స.) తమిళనాడులో ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్ ఏర్పాటు చేసిన సభలో పెను విషాదం చోటుచేసుకుంది. కరూర్ లో శనివారం జరిగిన ఈ సభలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించగా, వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా, విజయ్ ఏడు గంటలు ఆలస్యంగా సభా ప్రాంగణానికి రావడమే ఈ ఘోర దుర్ఘటనకు ప్రధాన కారణమని రాష్ట్ర డీజీపీ జి. వెంకటరామన్ పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.
డీజీపీ వెంకటరామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సభ నిర్వాహకులు 10 వేల మంది వస్తారని అంచనా వేసి అనుమతి కోరారు. కానీ, ఊహించని విధంగా సుమారు 27 వేల మందికి పైగా జనం పోటెత్తారు. భద్రత కోసం 500 మంది సిబ్బందిని మాత్రమే మోహరించాం అని తెలిపారు.
ఇంతకుముందు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ సభలకు తక్కువ సంఖ్యలో జనం వచ్చేవారని, ఈసారి మాత్రం అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయని ఆయన వివరించారు.
నిజానికి సభకు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉందని, కానీ పార్టీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో విజయ్ మధ్యాహ్నం 12 గంటలకే వస్తారని ప్రకటించారని డీజీపీ తెలిపారు. ఈ ప్రకటనతో ఉదయం 11 గంటల నుంచే ప్రజలు రావడం మొదలుపెట్టారు. కానీ విజయ్ వచ్చింది రాత్రి 7:40 గంటలకు. గంటల తరబడి ఎండలో సరైన ఆహారం, నీరు లేకుండా ఎదురుచూడటంతో జనం తీవ్ర అసహనానికి గురయ్యారు అని ఆయన అన్నారు. అయితే, తొక్కిసలాటకు కచ్చితమైన కారణం ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి