న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) శాసన నిర్మాణ ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గం(గవర్నర్లు, రాష్ట్రపతి) జోక్యాన్ని రాజ్యాంగం అనుమతించలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది. బిల్లుల రూపంలో ప్రజల అభీష్టం చట్టసభల్లో వ్యక్తమవుతుందని, దానిని రాష్ట్రపతి, గవర్నర్ల ఇష్టాయిష్టాలకు వదిలేయలేమని తెలిపింది. ప్రజల ఆకాంక్షలను రాష్ట్రపతి, గవర్నర్లు గౌరవించాలని అభిప్రాయపడింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు, తనకు న్యాయస్థానం గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము... సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం కోరిన అంశమై ఏడోరోజైన బుధవారం విచారణ కొనసాగింది. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు పశ్చిమ బెంగాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల చట్టబద్ధతను పరిశీలించే అధికారం గవర్నరుకు లేదన్నారు. ఒక చట్టం రాజ్యాంగబద్ధతను పరీక్షించాల్సింది న్యాయస్థానాలేనని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి నిలిపివేసిన సందర్భాలు చాలా అరుదని వెల్లడించారు. శాసన నిర్మాణంలో పార్లమెంటుకున్న అధికారాలే రాష్ట్ర అసెంబ్లీలకూ ఉంటాయని కపిల్ సిబల్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ