న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) ఈ ఏడాది ఉత్తర భారత్ అంతటా వరదలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్‌లు జరగడం.. కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు భారీ నష్టాన్ని చూశాయి. ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీని కూడా భారీ వరదలు ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భందంలో ఉన్నాయి. ప్రజలు శిబిరాలకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు.
కొండల్లో అక్రమంగా చెట్లు నరికివేయడం వల్లే ఈ వరదలకు కారణం అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్ర వరద తీవ్రతను ఎదుర్కొన్నాయని.. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పంజాబ్ దారుణమైన వరదను ఎదుర్కొంటోందని న్యాయస్థానం పేర్కొంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో అపూర్వమైన కొండచరియలు విరిగిపడడం వీడియోల్లో చూశామని.. ఈ వీడియోల్లో ఎక్కవగా కలప కనిపించిందని తెలిపారు. ఈ వరదలకు ప్రధాన కారణం.. అక్రమంగా చెట్టు నరికివేయడం వల్లే ఇదంతా జరుగుతుందని గవాయ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌కు నోటీసులు ఇచ్చారు. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ