న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) దిల్లీకి వరద ముప్పు క్రమంగా పెరుగుతోంది. నిరాశ్రయుల కోసం ఏర్పాటుచేసిన శిబిరాలే వరద నీటిలో చిక్కుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగింది. దాంతో మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతం నీట మునిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దిల్లీ(Delhi) పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 207.48 మీటర్ల మేర ప్రవహిస్తోంది. 5 గంటల సమయంలో ఇది 207.47గా ఉంది. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అలీపుర్ ప్రాంతంలో రోడ్డు పైనే లోతుగా గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్‌లోని భవనాల్లోకి వరద(Flood) నీరు ప్రవేశించింది. కశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యమునా నది పొంగిపొర్లుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ