నాగర్ కర్నూల్, 6 సెప్టెంబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల ప్రజలు తాగునీటి కోసం
జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో చేపట్టారు. దీంతో నాగర్ కర్నూల్ కొల్లాపూర్ మధ్య జాతీయ రహదారి పై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో గ్రామపంచాయతీ బోరు ను తొలగించారు. ఈ బోరుకు ప్రత్యామ్నాయంగా ఆ పక్కనే హైవే రోడ్డు కాంట్రాక్టర్ కొత్త గా బోర్ వేశారు. అలాగే మిషన్ భగీరథ పైప్ లైన్ రోడ్డు విస్తరణలో దెబ్బ తినడం మూలంగా ప్రజలకు తాగు నీటి సరఫరా గత 20 రోజులుగా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. సహనం కోల్పోయిన పెద్ద కొత్త పల్లి గ్రామస్థులు ఖాళీ బిందెలతో మహిళలు మండల కేంద్రంలో జాతీయ రహదారి పై గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు