సూర్యాపేట, 6 సెప్టెంబర్ (హి.స.)
కోదాడ కేంద్రంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కుంభకోణంలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ప్రకటించారు. లబ్ధిదారుల చెక్కులను నకిలీ పేర్లతో రీవాలీడేట్ చేసి డబ్బులు కాజేస్తున్న ఈ ముఠా వద్ద నుంచి నగదుతో పాటు డ్రా చేయని చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 44 చెక్కులకు సంబంధించి 38 చెక్కులను ఇప్పటికే విత్ డ్రా చేసిన ముఠా, మిగిలిన ఆరు చెక్కులను కూడా విత్ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు.పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.9.30 లక్షల నగదు, 6 డ్రా చేయని చెక్కులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కె. నరసింహ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, పట్టణ సీఐ శివశంకర్ పర్యవేక్షణలో ఈ అరెస్టులు జరిగాయి. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..