అమరావతి, 6 సెప్టెంబర్ (హి.స.) జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని, వాటి ప్రైవేటీకరణ వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేసేందుకే ఈ కుట్ర పన్నుతున్నారని ఆమె విమర్శించారు.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, అనుబంధ ఆసుపత్రి ఉండాలన్న గొప్ప లక్ష్యంతో జగన్ ఈ కాలేజీలను ప్రారంభించారని రజని గుర్తుచేశారు. పేదలకు ఉచితంగా వైద్యం, పరీక్షలు అందించాలనేది జగన్ ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ కాలేజీలను అమ్మకానికి పెడితే పేద ప్రజల పరిస్థితి ఏమిటి? కోట్లు ఖర్చు పెట్టి చదివించే స్థోమత మధ్యతరగతి కుటుంబాలకు ఉంటుందా? అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. కాలేజీల కోసం సేకరించిన భూములను కూడా ప్రైవేటుపరం చేయడం వెనుక భారీ స్కాం ఉందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వపరం చేయడమే కాకుండా, ఈ కుంభకోణంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని ఆమె స్పష్టం చేశారు.
అదేవిధంగా, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని రజని ఆరోపించారు. లక్షలాది మందికి ప్రాణదానం చేసిన సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని ఆమె మండిపడ్డారు. ఈ పథకాన్ని ప్రైవేటు బీమా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నంలోనూ మరో స్కాం ఉందని ఆమె ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలను 120 ఏళ్లు బతికిస్తానని చెప్పే చంద్రబాబు, ముందు తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపాలి. డబ్బా మాటలు కట్టిపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టాలి అంటూ విడదల రజని ప్రభుత్వానికి హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి