పాలకొల్లు, 6 సెప్టెంబర్ (హి.స.): లఘు చలనచిత్ర పోటీల ద్వారా సామాన్య ప్రజల్లో దాగివున్న సృజనాత్మ కథను వెలికి తీయవచ్చని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కలలకు పుట్టిల్లు అయినా పాలకొల్లులో ఎంతో మంది కళాకారులు పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఉందన్నారు.
భావితరాలకు కూడా ఈ ఘనతను అందించాలనే ఉద్దేశంతో లఘు చలనచిత్ర పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. సమాజంలో సమస్యలు చూపించడం, పరిష్కార మార్గాలు తెలియజేయడం ద్వారా లఘు చలనచిత్రాలు ప్రజాదారణ పొందుతాయన్నారు. తక్కువ నిడివి గల ఈ లఘు చలనచిత్రాలను చూడడం ద్వారా ఆయురారోగ్యాలు సంక్రమిస్తాయని అన్నారు. ఎంతోమంది నటీనటులు తెర పైకి రావడానికి ఇదో వేదికని చెప్పారు. ప్రశాంత వర్మ కూడా ఈ వేదిక ద్వారా తెరపైకి రావడం ఈ లఘు చలనచిత్రాల ఆవశ్యకతను తెలియజేస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఫిలింనగర్ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరాజు, మాజీ ఎంపీ చేగుండు వెంకట హరి రామ జాగయ్యను మంత్రి రామానాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, రేలంగి నరసింహారావు, రాజా వనం రెడ్డి, ముత్యాల శ్రీనివాస్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు,యూ కబర్ది,కేసు రాజు రాంప్రసాద్, డాక్టర్ కె ఎస్ పి ఎన్ వర్మ, జి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి